అనంతగిరి నుంచి కరోనా ఐసోలేషన్ సెంటర్ తరలించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా లో బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బిజెపి అఖిలపక్ష నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుకాణ సముదాయాలను మూసివేయాలని కోరగానే దుకాణం యజమానులు షాపు సైతం మూసివేసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్న నిరసన కారులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మండిపడ్డారు. అనంతగిరి గాలి చాలా ఆరోగ్యవంతమైనదని, అలాంటి వాతావరణంలో ప్రపంచాన్ని గజగజ వణికించే మహమ్మారి కరోనా వైరస్ కు సంబంధించి ఐసోలేషన్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇక్కడి వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం భయంకరమైన కరోనా వ్యాధిగ్రస్తులను ఇక్కడ ఉంచడం దారుణమన్నారు.
హరిత రిసార్ట్ హోటల్ చుట్టుపక్కల సామాన్య జనాలు జీవిస్తున్నారని వారికి ఇలాంటి కరోనా లాంటి భయంకరమైన ఇటువంటి రోగం వ్యాప్తి చెందితే ఎలా జీవిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ లో ఏర్పాటుచేసిన హరిత రిసార్ట్ లో ఐసోలేషన్ సెంటర్ లో ఏడు దేశాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు తీసుకువచ్చారు. వారికి సంబంధించినటువంటి మెడికల్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ భయంకరమైన ఇటువంటి కరోనా వ్యాధి సెంటర్ ఇక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.