మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి నటుడు డాక్టర్ రాజశేఖర్ చేసిన రాజీనామాను మూవీ ఆర్టిస్ట్స్ ఆసోషియేషన్ ఆమోదించింది. శనివారం జరిగిన అసోషియేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ‘మా’ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి మూవీ ఆర్టిస్ట్స్ ఆసోషియేషన్ వ్యవహారాలను పరిష్కరించేందుకు ఒక క్రమశిక్షణా కమిటీ వేయాలని అసోషియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ‘మా’ చీఫ్ అడ్వయిజర్ గా డాక్టర్ యు.వి.కృష్ణంరాజును, సభ్యులుగా డాక్టర్ కె.చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధ కపూర్ లను నియమించారు.
ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అసోషియేషన్ లో ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. చిరంజీవి మాట్లాడుతుండగా డాక్టర్ రాజశేఖర్ మైక్ లాక్కొని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అసోషియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసి రాజశేఖర్ తీరును తప్పుబట్టింది. దీంతో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజశేఖర్ రాజీనామాపై అసోషియేషన్ చర్చించి ఆమోదించింది.