టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కు నిర్ణయం తీసుకుంది ఫిలిం చాంబర్. ఈ మేరకు జనరల్ బాడీ మీటింగ్ లో నిర్ణయించారు సభ్యులు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఫిలిం చాంబర్ కొత్త అధ్యక్షుడిగా బసిరెడ్డిని ఎన్నుకున్నారు.
సమావేశం అనంతరం బసిరెడ్డి, దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. షూటింగ్స్ నిలిపివేతకు సంబంధించి గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు తెలిపిందని అన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదలపై ప్రధానంగా చర్చ సాగిందని బసిరెడ్డి తెలిపారు. షూటింగ్స్ ను కొన్ని రోజులు ఆపాలని నిర్ణయించినట్లు వివరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి, చిత్ర పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేందుకు ఏం చేయాలన్నది త్వరలో చర్చిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే 24 క్రాఫ్ట్స్ వారితోనూ చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.
నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఈమధ్య నిర్మాతలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. హీరోలు, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ లో కోత సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే అన్నీ చక్కబడే వరకు షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తున్నట్లు ఫిలించాంబర్ ప్రకటించింది.