దర్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ సెగ్మెంట్ లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పెట్టాలని సవాల్ చేశారు. రెండు నెలల్లో టీఆర్ఎస్ పార్టీ అనాథగా మారుతుందని.. ఎవరూ ఉండరని ఎద్దేవ చేశారు.
ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దర్పల్లిలో విగ్రహం ఏర్పాటు చేశారు. దానిని ఆవిష్కరించేందుకు అరవింద్ వెళ్తుండగా.. దర్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్లదాడి కూడా జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో దర్పల్లి పర్యటనను రద్దు చేసుకొని డిచ్ పల్లిలో మీడియాతో మాట్లాడారు అరవింద్.
గతంలో భైంసాలో ఐదుగురు హిందువులను చావబాదిన ఘటన ఇప్పుడు గుర్తుకొస్తోందన్నారు. బీజేపీపై దాడి చేసేవారు కూడా హిందువులేనని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. కేసీఆర్ పాలనలో ముస్లింలకు చెందిన ఆరు అంశాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
దేశంలో మోడీ వ్యతిరేక శక్తులు మైనార్టీ ముసుగులో ఏకమవుతున్నాయని ఆరోపించారు అరవింద్. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధాని బుట్టో హిజాబ్ వేసుకోలేదని గుర్తు చేశారు. ముస్లింలు ర్యాలీ చేస్తే అనుమతి ఇస్తారని.. హిందువులు చేస్తామంటే వద్దంటారని మండిపడ్డారు. మక్కాకు వెళ్తే డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం.. హిందువులకు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.