నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపుబోర్డు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కవిత ఓటమికి, అరవింద్ గెలుపుకు ప్రధాన కారణం పసుపు రైతులే అనేది సుస్పష్టం. పసుపుబోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఎంత మంది నాయకులు హామీ ఇచ్చినప్పటికీ పసుపు బోర్డు అనేది కలగానే మిగిలిపోయింది. 2019 ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన ఎంపీ డి.శ్రీనివాస్ తనయుడు అరవింద్ గంటల వ్యవధిలో పసుపు బోర్డు తీసుకొస్తా అన్న హామీ ఇచ్చారు.
తన ఎన్నికల ప్రచార సభలో ప్రతి చోటా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా… మరో అడుగు ముందుకేసి ఏకంగా బాండ్ పేపర్ రాసి ఇచ్చి సంచలనానికి దారి తీశారు. కానీ ఎంపీగా గెలిచన తర్వాత అరవింద్ చెప్పినట్లుగా పసుపు బోర్డ్ రాకపోవటంపై సోషల్ మీడియాలో, నియోజకవర్గంలో ఒత్తిడి బాగా పెరిగిపోయింది. పసుపు బోర్డు సంగతెంటీ? మీ హమీ ఇంకెప్పుడు నేరవేర్చుతారు అంటూ ప్రశ్నించటం మొదలుపెట్టారు.
అయితే, ఈ ప్రశ్నలపై సైలెంట్‌గా ఉన్న ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించటం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతోంది. తన ట్విట్టర్ ద్వారా తనపై వచ్చిన విమర్శలకు ఒక్క ట్వీట్‌తో సమాధానం చెప్పేశారు. ‘కళ్ళు తాగిన కోతుల్లా ఎగురుతున్నారు, మూర్ఖ జనులు, విచిత్ర జీవులు’ అని విమర్శలు గుప్పించారు. అయితే, ఇలా సడెన్‌గా అటాక్ మొదలుపెట్టడం వెనుక పసుపు బోర్డ్‌పై రెండు మూడు రోజులుగా కదలిక మొదలైంది. పసుపు బోర్డ్ కోసం ఎంపీ అరవింద్, తన తండ్రి డీఎస్ సహయంతో డిల్లీలో గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు.
అరవింద్ పసుపుబోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న మాట నిజమే కానీ , ఇచ్చిన హామీని నెరవేర్చమంటే ఎందుకింత అసహనం అని అడుగుతున్నారు నియోజకవర్గ ప్రజలు. గంటల్లో బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ ఎవరు రాసివ్వమన్నారు అని ప్రశ్నిస్తున్నారు. ధర్మపురి అరవింద్ కు ఎందుకు అంత అసహనం అన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పసుపుబోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన అరవింద్ కొంచెం నిగ్రహంగా ఉండి, ప్రశ్నించిన వాళ్లకు సమాధానం చెప్తే ప్రజల్లో తనకు మరింత గౌరవం, అభిమానం పెరుగుతాయి అంటున్నారు స్థానికులు.