తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరేందుకు అధిష్టానం ఓకే చెప్పిందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న మల్లన్నను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారాయన. మల్లన్న టెర్రరిస్ట్ కాదు.. పోరాట యోధుడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసి అయ్యా, కొడుకులకు చుక్కలు చూపించారని గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇంతకింత అనుభవిస్తారని విమర్శించారు.
సీఎం అరాచకాలను ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి మల్లన్నను జైలులో వేశారని ఆరోపించారు అరవింద్. అక్కడ కూడా సింగిల్ బ్యారక్ లో పెట్టి మానసికంగా ఇబ్బందులకు గురయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారు.. ఘన స్వాగతం పలుకుతామన్నారు అరవింద్.
మరోవైపు మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన భార్య మాతమ్మ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లన్నను అరెస్ట్ చేయాలన్నా.. మరో కేసు నమోదు చేయాలన్నా డీజీపీ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని స్పష్టం చేసింది. కేసు నమోదు చేసిన తరువాత 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని ఆదేశించింది హైకోర్టు. మల్లన్నపై ఉన్న 35 కేసులపై వాదనలు వినిపించారు ఆయన తరఫు న్యాయవాది దిలీప్ సుంకర. బెయిల్ పిటిషన్ పై మంగళవారం మరోసారి వాదనలు వినిపించనున్నారు.