నిజామాబాద్, జగిత్యాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్ రెండు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సమీక్ష అనంతరం నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ లో అన్ని శాఖలను అప్రమత్తం చేశామన్నారు. కలెక్టరేట్ లో, పోలీస్ శాఖ నుంచి కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 9 చోట్ల రహదారులు తెగిపోయాయని.. మూడు చోట్ల కుంటలు, ఐదు చోట్ల కాలువలు తెగిపోయాయని వివరించారు.
అలాగే నాలుగు చోట్ల 11, 33 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. ఆరేడు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయని.. వ్యవసాయానికి కరెంట్ సరఫరా నిలిపివేశామని తెలిపారు. జిల్లాలో 1067 చెరువుల్లో 740కిపైగా అలుగుపారుతున్నాయని.. 7,900 ఎకరాల్లో పంట నీటమునిగిదని వివరించారు కలెక్టర్. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని.. నిజామాబాద్ లో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు. ఎగువ నుంచి వరదనీరు పోటెత్తడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంది. 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి మాట్లాడుతూ.. రాయికల్ గోదావరి వద్ద 9 మంది రైతులు వరదల్లో చిక్కుకున్నారని, ఎన్డీఆర్ఎఫ్ బలగాల సహాయంతో స్పీడ్ బోట్ ద్వారా గాని లేదా చాపర్ ద్వారా గాని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే పనుల్లో నిమగ్నమయ్యామని తెలిపారు. ఇప్పటివరకు 6 ఇండ్లు పూర్తిగా, 158 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని వివరించారు.