నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ బతికున్నంత కాలం బీఆర్ఎస్‌కు జాతీయ పార్టీ హోదా రాదని ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించని వ్యక్తులు దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం సాధిస్తారని ఆయన మండిపడ్డారు.
నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చినంత మాత్రాన అది జాతీయ పార్టీగా మారిపోదని ఎద్దేవా చేశారు. దానికంటూ ఒక పద్దతి ఉంటుందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఎందుకు హాజరు కాలేదని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టవుతరని భావించే బీఆర్ఎస్ లాంచింగ్ కార్యక్రమానికి ఆమెను పిలవలేదా? అని అనుమానం వ్యక్తం చేశారు.
పాస్ పోర్ట్ బ్రోకర్‌కు సొంత విమానం ఎక్కడి నుండి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే గట్టి పోటీ ఉంటుందన్నారు. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదన్నారు.
ఏఐసీసీ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ వ్యవహారమని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారా లేదో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పసుపు రైతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.