బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. పోలీసుల అనుమతి లేకపోవడంతో వేదికను పార్టీ ఆఫీస్ కు షిఫ్ట్ చేయగా.. దీక్షలో పాల్గొనేందుకు వెళ్దామనుకున్న కొందరు బీజేపీ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు.
‘నిరుద్యోగ దీక్ష’కు వెళ్లకుండా తనను ముందస్తు గృహనిర్బంధం చేశారంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎంపీ అరవింద్. తన ఇంటి ముందు పోలీసులు ఉన్న ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీక్షలో పాల్గొనకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుందంటూ ట్వీట్ చేశారు అరవింద్. కేసీఆర్ ఫెయిల్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ సంఘాల నేతలను దీక్షలో పాల్గొనకుండా అడ్డుకోవడంపై బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా చేస్తున్న దీక్షను అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శనమన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి తమ పార్టీ కార్యాలయంలో దీక్ష చేపడుతుంటే ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగ దీక్షతో పీఠం కదిలిపోతుందనే భయంతోనే కేసీఆర్ ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు బండి. ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ కళ్లకు కనిపించడం లేదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి కరువై లక్షలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు అల్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కళ్లుండి చూడలేని విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.