ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఎన్నికల సంఘం రెండు చోట్ల ఓట్లు హక్కు కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఓటర్ లిస్ట్ లో సాధారణంగా తప్పులు సర్వ సాధారణం. ఓటు హక్కు ఉన్నవాళ్లకు రెండు, మూడు ఓట్లు ఉంటే.. మరికొందరికి ఓటర్ లిస్ట్ లో పేరు కనిపించదు. అయితే అవి సాధారణ ఓటర్లకే పరిమితం కాదు. ప్రముఖులకు కూడా రెండు ఓట్లు కల్పించి వివాదంలో చిక్కుకుంది ఈసీ.

తాజాగా ఎంఐఎం అధినేతగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. గురువారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో ఎంపీకి రెండు చోట్ల ఓటు హక్కు కల్పించింది ఈసీ.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో EPIC నెంబర్: KGY0601229, పార్ట్ నెంబర్:401, సీరియల్ నెంబర్ 906తో ఒక ఓటు ఉంటే.. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో EPIC నెంబర్: TDZ1557521, పార్ట్ నెంబర్:25, సీరియల్ నెంబర్ 412తో ఎన్నికల కమిషన్ మరో ఓటు కల్పించింది.
అయితే అసదుద్దీన్ కు రెండు చోట్ల ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ ను జత చేశారు. ఆధార్ తో అనుసంధానం చేస్తే.. డూప్లికేట్ కు అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. కానీ ఓ ఎంపీ స్థాయి వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉందంటే.. మరి సాధారణ ప్రజలపరిస్థితి ఏంటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.