మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ వీడింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
కొద్దిసేపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే వాదనలకు ఎంత సమయం పడుతుందనీ సీబీఐని ముందు హైకోర్టు అడిగింది. గంట పాటు వాదనలు వినిపిస్తున్నామన్న సీబీఐ స్పష్టం చేసింది. దీంతో శుక్రవారం ఉదయమే వాదనలు వింటామని, ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభిస్తామని తెలిపింది న్యాయ స్థానం.
కాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఎంపీ అవినాష్ ని నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసుకుంది. అయితే తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంగా ఉన్నారని, అరెస్ట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు.
ఈ మేరకు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. కాగా శ్రీలక్ష్మీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాష్ తల్లి చికిత్స పొందుతున్నారు.