మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లు నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి.
వీటిని ఇవాళ కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ తరలించారు. మూడు పెట్టెల్లో వీటిని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకువచ్చారు. సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది. మరో వైపు ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ నోటీసులపై ఆయన ఘాటుగా స్పందించారు. నిన్న మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి ఇవాళ మధ్యాహ్నం విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.
ఇక ఐదు రోజుల పాటు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని వెల్లడించారు. చక్రాయపేట మండలం గండి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన అవినాష్ రెడ్డి.. అక్కడే శాశ్వత అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ నోటీసులపై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తిగా సహకరిస్తారని వెల్లడించారు.
అయితే ఐదు రోజుల పాటు సమయం కావాలని సీబీఐకి లేఖ రాశారని తెలిపారు ఎంపీ అవినాష్ రెడ్డి. మరోసారి సీబీఐ అధికారులు తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నందున ఆ నోటీసు తీసుకున్న తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఇదే సందర్భంలోనే రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు విషయంలో తన పై తన కుటుంబం పై ఓ వర్గం అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. ఇలాంటి విషయాలపైన ఓ నిర్ణయానికి రావడం ఎవరికైనా మంచిది కాదని హితవు పలికారు. ఈ కేసులో న్యాయం గెలవాలి..నిజం నిర్భయంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను తెలిపారు.