మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి మరణం పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రీతి మరణం బాధాకరమన్న సంజయ్…ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రీతి కుటుంబం ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రీతి మరణించడం తన మనస్సును కలచివేసిందన్నారు.
ప్రీతిది ముమ్మాటికీ హత్యే అన్నారు. ప్రీతి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం పట్టించుకుంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. ముమ్మాటీకి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రీతి మరణించిందన్నారు. కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు.
ప్రీతి ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించేంత వరకు తాము పోరాడతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకు రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందంటూ ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థిని కాబట్ట ఏమైనా పర్వాలేదని స్పందించడం లేదా అంటూ మండిపడ్డారు. మీరు ఇచ్చే రూ. 10లక్షల సాయం ఆ తల్లిదండ్రుల గుండె కోత చల్చార్చుతుందా అంటూ ఫైర్ అయ్యారు.