– కేంద్ర నిధులు, కృష్ణా జలాలు, పాలమూరుపై చర్చకు సిద్ధమా?
– మీలో తెలంగాణ రక్తముంటే రావాలి
– ప్రజల కోసం పొర్లు యాత్రకైనా సిద్ధమే..
– కేసీఆర్ రాక్షస పాలన అంతానికే ప్రజా సంగ్రామ యాత్ర
– 14న అమిత్ షా సభకు భారీగా తరలిరండి
– పాదయాత్రలో బండి సంజయ్
పాలమూరు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుతోంది. తాము అభివృద్ధి చేస్తుంటే కొందరికి కళ్లు ఎర్రబడుతున్నాయంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించగా.. కేంద్ర నిధులు, కృష్ణా జలాలు, పాలమూరుపై చర్చకు సిద్ధమా? అంటూ ప్రతి సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 27వరోజు రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. డప్పులు, వాయిద్యాలు, గిరిజన నృత్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. గజమాలతో బండిని సత్కరించారు. ఇదే సమయంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. తర్వాత తొమ్మిది రేకుల గ్రామ ప్రజలను ఉద్దేశించి బండి ప్రసంగించారు.
తెలంగాణకు కేంద్ర నిధులు, కృష్ణా జలాల వాటాలో జరిగిన అన్యాయం, పాలమూరు వెనుకబాటుతనంపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు బండి. ఏపీతో కుమ్కక్కై తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే అంగీకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఇంకా ఎడారినే తలపిస్తోందనే మాటకు కట్టుబడి ఉన్నానని తనతోపాటు వస్తే ప్రజల సమక్షంలోనే ఈ విషయాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కేంద్ర నిధుల్లేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా తప్పని నిరూపిస్తామన్నారు.
‘‘కేసీఆర్.. మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే.. మీరు తెలంగాణ వాదులే అయితే.. మీకు నిజాయితీ ఉంటే బహిరంగ చర్చకు రండి. నేనింకా రంగారెడ్డి జిల్లాలో 4 రోజులు పాదయాత్ర చేస్తా.. ప్రజల సమక్షంలోనే తేల్చుకుందాం.. రండి’’ అని ఘాటైన పదజాలంతో సవాల్ విసిరారు సంజయ్. ప్రజా సంగ్రామ యత్రతో టీఆర్ఎస్ బాక్స్ లు బద్ధలవుతున్నాయని.. కేసీఆర్ రాత్రి అంతా తాగుడు, తెల్లారిందాక పండుడేనని విమర్శించారు. కేసీఆర్ తాగి పండుతుంటే కేటీఆర్ మొరుగుతుండని మండిపడ్డారు. ఆయ్యా కొడుకుల బతుకు బరబాత్ చేస్తామని.. వారి మోసం, బండారం బయటపెడతామన్నారు. పాలమూరు పచ్చగున్నదంట.. రండి ఇంకా నాలుగు రోజులుంటా.. ఎడారిగా మారిందని నేను నిరూపిస్తా.. దమ్ముంటే రండి అని సవాల్ చేశారు.
‘‘టీఆర్ఎస్ పనైపోయింది. అందుకే కేటీఆర్ సభకి కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అమెరికాలో చెప్రాసి పని చేసుకుని, ఉద్యమంలో పాల్గొనకున్నా మంత్రి అయిన కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారు. 299 టీఎంసీలకు ఒప్పుకుని 575 టీఎంసీల వాటాకు గండి కొట్టి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు తీరని నష్టం చేసిన ద్రోహి కేసీఆర్. ఆధారాలతో సహా ఒప్పించేందుకు నేను సిద్ధం. పాదయాత్రలో ప్రజలు మద్దతు చూస్తుంటే.. టీఆర్ఎస్ నేతలకు కళ్ళు కనిపించడం లేదు. తెలంగాణ దీక్ష చేయకుండా గద్దెనెక్కిండు కేసీఆర్. పేదలకు ఫ్రీగా 5 కిలోల బియ్యాన్ని మోడీ ఇస్తుంటే.. కేసీఆర్ అమ్ముకుంటున్నాడు. పేదలకిస్తున్న బియ్యాన్ని అమ్ముకుంటూ పేదల రక్తాన్ని తాగుతున్న నీచమైన బతుకు కేసీఆర్ ది.. ఇట్లాంటి బతుకు ఎందుకు బతుకుతున్నడో అర్ధం కావడం లేదు?’’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బండి సంజయ్.
తెలంగాణకు లక్షా 40వేల ఇండ్లను మోడీ మంజూరు చేస్తే.. తొమ్మిది రేకుల గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని ప్రశ్నించారు. పేదల ఉసురు పోసుకుంటున్నారని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. తాను మాత్రం తన ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్.. నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులను కుర్చీ వేసి కూర్చుని పూర్తి చేస్తానన్న హామీ ఏమైంది? నమ్మించి మోసం చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఫైరయ్యారు. ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు తాను పాదయాత్ర చేస్తుంటే మోకాళ్ల యాత్ర చేయాలంటూ టీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు.. ప్రజల కోసం పొర్లుకుంటూ తిరగడానికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధమని స్పష్టం చేశారు.
కేసీఆర్ రాచరిక, అరాచక, కుటుంబ పాలనను అంతమొందించడానికే.. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారని అన్నారు బండి. ‘‘తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే. కేంద్ర ప్రభుత్వం వాటా లేకుండా స్మశాన వాటికలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తున్నావా అని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా. కేంద్ర నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతోందని నిరూపించేందుకు నేను సిద్ధం… దమ్ముంటే చర్చకు రావాలి. మీకు చేతగాకపోతే మీ చెంచాగాళ్లను పంపినా సరే. మా ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధం. 1400 మంది అమరులయితేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏం చేశాడు తెలంగాణ రావడానికి? మందులో సోడా పోసే సంతోష్ రావు.. తెలంగాణ ఉద్యమంలో ఏం త్యాగం చేశాడు? పేదలను అభివృద్ధి చేయడానికి.. ప్రజలకు న్యాయం చేయడానికి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. పాలమూరు జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లాలో ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. మే 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో జరిగే “ప్రజా సంగ్రామ యాత్ర-2” ముగింపు సభ.. తెలంగాణలో ఒక సంచలనం సృష్టించబోతోంది. ‘అమిత్ షా’ పాల్గొనే ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నాం. 5 లక్షల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కోరుతున్నా’’ అని చెప్పారు బండి సంజయ్.