పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోడీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. గతంలో ఏ ప్రధానైనా లేదా ఇతర పార్టీల నేతలెవరైనా పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు.
సనత్ నగర్‌లోని హిందూ పాఠశాలలో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆచన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరీక్షలను ఎదుర్కోవడంలో విద్యార్థులు పడే ఇబ్బందులను తొలగించేందుకు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు.
రాష్ట్రంలోని 600 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు పరీక్షా పత్రాలను ముందుగానే లీక్ చేస్తున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే వాటికి ర్యాంకులు వస్తున్నాయని ఆరోపించారు.
అలాంటి నిర్బంధ చదువులు ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు బయటి ప్రపంచాన్ని చూడకుండా పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్నాయన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే పరిస్థితి రావాలని ఆయన అన్నారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడారు. విద్యార్థులు టైం మేనేజ్మెంట్ అలవర్చుకోవాలని సూచించారు. ఎన్నడూ అలసిపోవద్దన్నారు. ప్రధాని ఇచ్చిన సక్సెస్ మంత్రతో విద్యార్థులు అంతా విజయం సాధించాలన్నారు.