బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. 23 రోజు మహబూబ్ నగర్ పట్టణంలోని తూర్పు కమాన్, అంబేద్కర్ క్రాస్ రోడ్స్ మీదుగా పాదయాత్ర నిర్వహించారు. దారిపొడవునా అపూర్వ స్వాగతం పలికి సంజయ్ వెంట నడిచారు ప్రజలు. ఆనందంతో చిన్నారులు కరచాలనం చేసి పాదయాత్రలో మమేకమయ్యారు.
పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బండి. ఆ మహనీయుడి స్ఫూర్తితో, వారి ఆశయ సాధనలో భాగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇటు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ దివ్యాంగులు సంజయ్ తో పాటు నడక సాగించారు. దివ్యాంగుల సమస్యలు వింటూనే వారి జీవితాలకు భరోసా ఇచ్చే గొప్ప కార్యక్రమాలు చేస్తానని మాట ఇచ్చారు బండి.
ఇక మహబూబ్ నగర్ లో ముదిరాజ్ లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సంజయ్. ఆయనతో తమ సమస్యలు వివరించారు వారంతా. అవన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తానని సంజయ్ హామీ ఇచ్చారు.
తాను చావుకెప్పుడు భయపడనని.. చావే తనను చూసి భయపడిందన్నారు బండి సంజయ్. మూడుసార్లు తనను చంపే ప్రయత్నాలు జరిగాయని వివరించారు. అలాగే.. గుండెపోటుతో దాదాపుగా చావు అంచుల వరకు వెళ్లొచ్చానని అన్నారు. అమ్మవారి కృపతో చావు నుంచి బయటపడ్డానని తెలిపారు. అమ్మవారి దయతో దక్కిన ఈ జీవితం ధర్మ రక్షణ కార్యనిర్వహణ కోసమేనని స్పష్టం చేశారు.