33శాతం మహిళా రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేశారని, మరి సీఎం కేసీఆర్ తన కేబినెట్‌లో ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చారో చెప్పాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్లు అని సీఎం కేసీఆర్ అన్నారని ఆయన చెప్పారు.
మరి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ ఎలా అమలు చేస్తారని ఆయన అడిగారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందు సీఎం కేసీఆర్‌తో 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయించి తర్వాత కేంద్రాన్ని అడగాలని ఆయన సూచించారు.
రేపు ఈడీ విచారణ వుందన్నారు. ఈ సారి కూడా కేబినెట్ మొత్తాన్ని వెంట వేసుకుని మంత్రి కేటీఆర్ వస్తారేమోనని ఆయన ఎద్దేవాచేశారు. తెలంగాణ మంత్రులకు తాను మరోసారి చెబుతన్నానని, ఊరికే ఢిల్లీకి రావొద్దని ఆయన సూచించారు. విమానాశ్రయంలో ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీ ఉందన్నారు.
ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వాటిలో నమోదవుతుందని చెప్పారు. మీడియా సంస్థలను బ్యాన్ చేస్తామన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. త్వరలోనే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు బ్యాన్ చేస్తారన్నారు.
మంత్రి కేటీఆర్ కన్నా సంతోష్ జీ బాగా చదువుకున్నాడని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కోర్టుకు వెళ్లి సంతోష్జీ ఆర్డర్ తెచ్చుకున్నారని కేటీఆర్ గతంలో చెప్పారన్నారు. మరి ఇప్పుడు కవిత కోర్టుకు ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.