రాష్ట్రంలో పాలన సెక్రటేరియట్ నుండి కాకుండా ఫార్మ్ హౌస్ నుండి కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పసుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ అరవింద్ కృషి చేస్తున్నారని తెలిపారు.
పసుపు రైతుల కోసం మాజీ ఎంపీ కవిత ఎన్నడూ కేంద్రంతో మాట్లాడలేదని వెల్లడించారు. కవిత హయాంలో పసుపు రైతులకు ఎలాంటి వసతులు లేవని.. అరవింద్ ఎంపీ అయిన తర్వాతనే అన్ని వసతులను చేకూర్చారని తేల్చిచెప్పారు. పసువు రైతులకు గతంకంటే మంచి ధరలు వస్తున్నాయని.. అందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు.
తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నప్పటికీ.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రధాని మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపియేనని స్పష్టం చేశారు.
పెట్రోల్, డిజిల్పై టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని పాండే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలను తెలంగాణ సర్కార్ విస్మరించిందని విరుచుకుపడ్డారు పాండే.