పసుపు రైతులకు ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. పీఎం ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) అమలుకు నోచుకోవడంలేదన్నారు. అందుకే పసుపు రైతులకు పరిహారం అందడం లేదన్నారు.
రాష్ట్రంలో గత వర్షాకాలంలో అకాల వర్షాలకు 70 శాతం పసుపు పంటలు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. మార్కెట్‌లో పసుపు క్వింటాల్ ధర రూ. 6 వేల నుంచి 7500 వరకు ఉన్నప్పటికీ రైతులకు ఏ మాత్రమూ గిట్టుబాటు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
ఈ విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కోరిందా అంటే అదీ లేదన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో ప్రస్తావించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదని సమాధానం వచ్చిందన్నారు. ఈ క్రమంలో పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చినట్లు పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి చొరవ తీసుకోవాలని ఆయన అడిగారు. మంత్రి కేటీఆర్ ప్రతి ఏటా దావోస్ వెళతారని అన్నారు. ఈ 9 ఏండ్ల కాలంలో కనీసం రాష్ట్రానికి ఒక్క పరిశ్రమనైనా తీసుకు వచ్చారా అని ఆయన డిమాండ్ చేశారు.