కేసీఆర్ కు ఎంపీ డీఎస్ సలహా - Tolivelugu

కేసీఆర్ కు ఎంపీ డీఎస్ సలహా

గౌ .ముఖ్యమంత్రివర్యులు
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి
నమస్కారం!
గత నెలరోజులకు పైగా సంస్థ మనుగడ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్నది.వారి పోరాట పటిమను చూస్తుంటే ” లక్ష్యసాధనలో ఎప్పుడూ శృతి మించకు ,ఎవరికీ తల వంచకు ” అన్న స్ఫూర్తి గోచరిస్తున్నది .ఉద్యోగాలు ఉంటాయో ,పోతాయో అనే ఆందోళనకర పరిస్థితుల్లో కూడా కార్మికులకు పిల్లా పాపలతో సహా వారి కుటుంబాలు మొక్కవోని ధైర్యంతో అండగా నిలిచిన తీరులో ,తెలంగాణ మట్టిలోనే ఉన్న దశాబ్దాల ధైర్యం పరిమళిస్తున్నది.ఉద్యోగ భద్రత పేరున నలభైఎనిమిదివేల కార్మికుల మెడ మీద కత్తి పెట్టినా ,కనీసం ఒక్కశాతం ఉద్యోగులు కూడా తలవంచక నిలబడ్డ ధైర్యం లో తెలంగాణ శౌర్యం కనిపిస్తున్నది .
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏ సంస్థనైనా ఎలా నడపాలి అన్న విషయంలో ముఖ్యమంత్రిగా మీకు విశేషమైన విచక్షణాధికారాలుంటాయన్నది అందరికీ తెలిసిందే .కానీ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం లోని తొమ్మిదవ షెడ్యూల్ లో ఉన్న ఏ పీ ఎస్ ఆర్ టీ సీ విభజన,ఆస్తుల పంపకం పూర్తిగా జరగకముందే ,టీ ఎస్ ఆర్ టీ సీ అనే సంస్థ ఇంకా పూర్తి చట్టబద్ధంగ్సా ,అధికారికంగా మనుగడలోకి రాకముందే ,సంస్థలో వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదాన్ని పొందకుండానే ఆర్టీసీ ని ప్రయివేటు పరం చేయడం సరికాదు…,సాధ్యం కూడా కాదన్న విషయం మీకు తెలియందికాదు .
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్టు, ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే,అనుచితమైన సలహాలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించడం వల్లనే ఈ అస్తవ్యస్త ,అసందిగ్ధ,ఆందోళనకర,అవాంఛనీయ పరిణామాలు తలెత్తినట్టు అనిపిస్తున్నది .ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి ,తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆర్టీసీ పోరుబిడ్డల పట్ల మీ స్వభావానికి విరుద్ధంగా ఇంత కఠినంగా మీరు వ్యవహరించడం చూస్తుంటే ఎవరిదో కుట్ర ఉన్నట్టు అనుమానమొస్తున్నది .తెలంగాణ బిడ్డలు ఎవరికీ తల వంచరు అన్న విషయం మీకు తెలియందికాదు .అయినా నేరుగా మీ ద్వారానే ఆర్టీసీ కార్మికులనే కాకుండా ,వారి కుటుంబాలను కూడా బెదిరించే దుస్సాహసానికి పాల్పడ్డ కుట్రదారులు ఎవరో అర్థం కాకున్నది .కార్మికుల బలవన్మరణాలకు బాధ్యులైన వారిమీద గుండె రగులుతున్నది .
ఇప్పటికే కార్మికులతోపాటు ప్రజలు కూడా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు.ఇంకా పంతాలు,పట్టింపులకు పోకుండా ,వెంటనే ముందుగా సమ్మెలో ఉన్న కార్మికులందరికీ ఉద్యోగభధ్రతను ప్రకటించడం ద్వారా వారిలో విశ్వసనీయతను కల్పించి,సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి,వారి న్యాయమైన కోరికలను అంగీకరించి,ఈ వివాదానికి ముగింపు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.దీనివల్ల విపరీతమైన అసౌకర్యానికి గురవుతున్న తెలంగాణ ప్రజలు సైతం మీ నిర్ణయాన్ని హర్షిస్తారు.ఆర్టీసీ ప్రయివేటైజేషన్ వెనుక ఆర్ధిక కోణాలు దాగున్నాయని వస్తున్న ఆరోపణలకు కూడా తెర పడుతుంది.తదనంతరం రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి మీరు తీసుకునే హేతుబద్ధమైన చర్యలకు అందరి హర్షామోదాలు లభిస్తాయి.అన్నీ తెలిసిన మీరు అన్నిరకాలుగా వివేచించి,ఒక కుటుంబ పెద్దగా ఆలోచించి,సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని నిండుమనసుతో కోరుకుంటున్నాను.

భవదీయుడు

డి .శ్రీనివాస్
పార్లమెంట్ సభ్యుడు

Share on facebook
Share on twitter
Share on whatsapp