హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళతో మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లు అందులో ఉంది. ఈక్రమంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా మాట్లాడడం ఏంటని నెటిజన్లు, వ్యతిరేక పార్టీల నేతలు సోషల్ మీడియాలో తీవ్రంగా కామెంట్స్ పెడుతున్నారు.
మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆయన తీరు ఉందని మండిపడ్డారు. వీడియో లీక్ కావడంతో వెంటనే మాధవ్ పై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని తెగ హడావుడి చేస్తున్నారు. నిజాయతీ గల పోలీస్ అధికారినని చెప్పుకుని.. ఆ ప్రచారంతోనే మాధవ్ ఎంపీగా గెలిచారని గుర్తు చేస్తున్నారు.
ఇటు ఈ వీడియోపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు మాధవ్. వీడియోలను మార్ఫింగ్ చేశారని అన్నారు. ఇదంతా కావాలని చేసిన కుట్రగా చెప్పారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని.. అవసరమైతే ఫోరెన్సిక్ టెస్ట్ కైనా రెడీ అని ప్రకటించారు. ఇప్పటికే, జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరినట్టు చెప్పారు. ఇదంతా, తెలుగుదేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట చేసిన కుట్ర అని.. వారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోను సృష్టించారని మండిపడ్డారు మాధవ్. గతంలో తాను జిమ్ చేసిన వీడియోలను మీడియాకు చూపించారు. అరగుండు అయ్యన్నపాత్రుడు కూడా ఇందులో కుట్రదారుడిగా పేర్కొన్న ఆయన.. తనను డ్యామేజ్ చేయడం కోసం మార్ఫింగ్ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే స్ట్రయిట్ గా ఎదుర్కోవాలని ఛాలెంజ్ విసిరారు. ఈ వీడియోను టెలికాస్ట్ చేస్తున్న వారిపైనా లీగల్ యాక్షన్ తీసుకుంటానన్నారు గోరంట్ల.