దేశంలో పలు మెట్రో సిటీల్లో 5జీ సర్వీసులను శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలా ప్రారంభించిన సిటీల్లో ఏపీకి చెందిన సిటీ ఒక్కటి కూడా లేదు. వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికంగా ఉన్నప్పటికీ.. 5జీ సర్వీసుల్లో ప్రాధాన్యత కల్పించకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. 5జీ సేవల కోసం విశాఖపట్నం ఎంతో అనుకూలమైనది.. ఆర్థిక ప్రాముఖ్యత కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు జీవీఎల్. దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు పీఎం మోదీకి అభినందనలు తెలిపారు జీవీఎల్.
కేంద్రం అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ 5జీ టెక్నాలజీ డిజిటల్, ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతోందని.. తదుపరి రెండో విడతలోనైనా ఆంధ్ర ప్రదరేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని లేఖలో కోరారు. అతి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి 5జీ సేవలను తీసుకురావాల్సిన అవసరాన్ని లేఖలో ప్రత్యేకంగా చెప్పారు జీవీఎల్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ గ్రోత్ ఇంజిన్ లాంటిదన్నారు. విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉందన్నారు. వైజాగ్ పోర్ట్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలను కలిగి ఉందని లేఖలో పేర్కొన్నారు. విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక, ముఖ్యమైన ప్రాంతమని జీవీఎల్ వెల్లడించారు.
కాగా.. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పటికీ.. ఆయన ఏపీ విషయాల్లోనే ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఆయన విశాఖ నుంచే ఎక్కువగా రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో సాగుతోంది. ఈ కారణంగానే ఆయన విశాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని..ఏమైనా సమస్యలు ఉంటే కేంద్రానికి లేఖలు రాస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.