కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామని, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయనని పార్టీ నియమించినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహా రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదాలు కన్నాకు కల్పించినట్లు జీవీఎల్ చెప్పారు. పార్టీ నుంచి రాజీనామా చేస్తూ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని భావిస్తున్నామన్నారు.
కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవన్నారు. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ అనుమతితో చేసినవేనని తెలిపారు. పార్టీలో పదవుల నుంచి ఎవరిని తొలగించినా, నియమించినా అవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కాదన్నారు.
పార్టీని వీడుతూ సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదన్నారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించనని జీవీఎల్ చెప్పారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉన్నాయని, ఎంపీగా తనకు ఉన్న అవకాశాల మేరకు తాను పనిచేస్తానని చెప్పారు.
బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అత్యున్నతమైనదని, బయటి నుంచి వచ్చిన వారికి బీజేపీలో అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం అత్యంత అరుదైనదని గుర్తు చేశారు. కన్నాకు బీజేపీ అలాంటి అవకాశం ఇచ్చిందన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా పూర్తి స్థాయి గౌరవాన్ని బీజేపీ ఇచ్చిందన్నారు జీవీఎల్ నరసింహా రావు.