ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపుతోంది. కారణం ఏమిటో కనిపెట్టలేక ప్రభుత్వం, స్థానిక డాక్టర్లు అయోమయమవుతున్న తరుణంలో తెరపైకి అనేక అనుమానాలు వస్తున్నాయి. గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు సైతం ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి వస్తుండటం అందర్నీ టెన్షన్ పెడుతుంది.
ఢిల్లీ నుండి ప్రత్యేక వైద్య బృందాలు, మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు, ఇతర నిపుణులు వచ్చి వ్యాధి మూలాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పక్కగా మాత్రం చెప్పలేకపోతున్నారు. అయితే, ఈ వ్యాధి లక్షణాలను బట్టి దీనికి సీసం కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అభిప్రాయపడ్డారు.
రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. సీసం, నికెల్ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు దిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో వెల్లడైందని, సీసం కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండవచ్చన్న ఎంపీ… పరీక్షల వివరాలు మంగళగిరి ఎయిమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందాయని తెలిపారు. తాగునీరు, పాల నమూనాలు పంపాలని దిల్లీ ఎయిమ్స్ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని జీవీఎల్ అన్నారు.
ఏలూరులో మూడు రోజుల్లో 488మంది అనారోగ్యానికి గురవ్వగా, 332మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 18మందిని మెరుగైన వైద్య సహాయం కోసం విజయవాడకు తరలించారు.