తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైపై డీఎంకే నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి ఫైర్ అయ్యారు. అన్నామలై పై ఆయన పార్టీకే చెందిన మహిళ నేత ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. ముందు వాటికి అన్నామలై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
చెన్నై విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీలపై విమర్శలు చేయడం అన్నామలై మానుకోవాలని అన్నారు. ఇప్పుడు ఆయనపై ఆరోపణలు వచ్చాయన్నారు. దానికి ఆయన ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు.
ఆయనపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చూడాలి మరి అని ఆమె అన్నారు. ఇది ఇలా ఉంటే తమ పార్టీ బహిరంగ సభలో మహిళా కానిస్టేబుళ్ళను హేళన చేశారంటూ వస్తున్న వార్తలు ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి వెళ్లాయన్నారు. దానిపై ఆయన తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
మహిళల రక్షణకు డీఎంకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా తాము సహించబోమని పేర్కొన్నారు. అలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాల్సిందేనన్నారు. పార్టీ అధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు, బహిరంగ సభలపై పూర్తిస్థాయిలో నిఘా వేయలేమని పేర్కొన్నారు.