ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారా…? చర్చలంటూ కేకేతో ప్రకటన వెనుక కేసీఆర్ ఉన్నారా…? ఎందుకు చర్చలకు రెడీ అని యూటర్న్ తీసుకున్నట్లు…?
సెల్ఫ్ డిస్మిస్… ఇక వారి పని అయిపోయిందంటూ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టారు సీఎం కేసీఆర్. కొత్త ఉద్యోగాలకు నోటీఫికేషన్ అంటూ ప్రకటనలు విడుదల చేశారు. సమ్మె మొదలై పది రోజులు అవుతోన్న సమయంలో… సమ్మె విషయంలో కార్మికులు మరింత ఉదృతంగా పోరాటం చేస్తుండటంతో కార్మికుల నుండే కాదు, ప్రజలు… టీఆర్ఎస్ నేతల నుండి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది. పైగా… ఇద్దరు కార్మికులు ఆత్మబలిదానం చేయటంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది.
ఏ చితి మంటల సాక్షిగా నాడు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించామో… అవే చితి మంటలు కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతాయంటూ విమర్శలు పెరిగాయి. దాంతో కేసీఆర్ సీనీయర్ నేత కేకే ద్వారా ఓ ప్రకటన రిలీజ్ చేయించారు. సమ్మె పరిష్కారం కాదని, చర్చలకు యూనియన్ నేతలు అంగీకరించాలంటూ కోరారు. దాంతో సమ్మెపై కేసీఆర్ కాస్త మెత్తబడ్డారు… సరే సమ్మెకు ఓ పరిష్కారం లభిస్తుంది లే అని అంతా అనుకునే లోపే కేకే యూటర్న్ తీసుకున్నారు. నేనేమి మద్యవర్తిత్వం వహిస్తా అన లేదని… ప్రభుత్వం సిద్దంగా ఉంటే సరే అన్నాను అని ప్రకటించారు.
అయితే, కేకే యూటర్న్ వెనుక కేసీఆర్ మైండ్ గేమ్ ఉందంటున్నారు పోలిటికల్ ఎక్స్‌పర్ట్స్. వరుసగా ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవటం, చాలా చోట్ల ఆత్మహత్యలకు ప్రయత్నించటంతో కార్మికులు, ప్రజల ఆగ్రహాన్ని కాస్త డైవర్ట్ చేసే ఉద్దేశమే తప్పా మరోకటి కాదంటన్నారు. లేకపోతే సీనీయర్ నాయకుడైన కేకే రెండో రోజే మాట మారుస్తారని, సీఎంతో మాట్లాడకుండా… సీఎం సూచనలు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో పార్లమెంటరీ నేత లెటర్ హెడ్‌పై అధికారికంగా ప్రకటన జారీ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి తాను వెళ్లే వరకు పరిస్థితులు చేయిదాటకుండా ఉండేందుకే కేసీఆర్ ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.