‘‘ప్రెస్ మీట్లు.. పేపర్ ప్రకటనలు కాదు చేయాల్సింది.. చేయాల్సింది వేరే..ఇలా అయితే కష్టం’’ ఇది టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్. ఇది ఎవరి గురించో.. ఎవరికి చెప్పాలని పెట్టిందో వేరే చెప్పనక్కర్లేదుగా. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లో తిరుగుబాటు రావాలని పిలుపునిస్తే.. అది ఆ పార్టీ నేతల్లోనే తిరుగుబాటు తెచ్చేలా ఉంది. వైసీపీ ఇంత దూకుడుగా వెళుతున్న.. కేవలం ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు పార్టీలోనే పెరిగిపోతున్నాయి. చాలామంది నేతలు.. అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేసేవారిని కాదని.. ఎవరెవరికో పదవులు ఇచ్చి దగ్గర పెట్టుకున్నారు. ఓడిపోయాక వారిలో చాలామంది.. సొంత వ్యవహారాలు చూసుకుంటూ.. అవసరమైతే వైసీపీతో ఫ్రెండ్ షిప్ కూడా చేస్తూ.. పనులు చేసుకుంటున్నారు. ఎటొచ్చీ.. నిజాయితీగా టీడీపీ కోసం పని చేసినవారు మాత్రం వైసీపీ పెట్టే వేధింపు కేసుల్లో ఇరుక్కుని.. నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇంత దారుణంగా ఎప్పుడూ అధికార పార్టీ నుంచి వేధింపులు లేవని.. మరీ ఇంత ఘోరంగా న్యాయస్థానాలను, చట్టాలను కాదని మరీ నిర్ణయాలు చేసి.. బుల్ డోజ్ చేసుకుని తోసుకుపోయే ప్రభుత్వాలను చూడలేదని.. వారు విమర్శిస్తున్నారు. అంతే కాదు.. జనంలో చాలామందికి అసంతృప్తి ఉన్నా.. వారిని లీడ్ చేసే నాయకుడే లేకుండా పోయాడని వారు ఆవేదన చెందుతున్నారు.
ఇలాంటి పరిస్ధితిలో.. కేశినేని నాని ట్వీట్ పార్టీలో కేక పుట్టిస్తోంది. పార్టీలో ఉన్న అసంతృప్తిని ఇది రిఫ్లెక్ట్ చేస్తుందని చాలా కామెంట్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా కేశినేని నాని.. తనకు లోక్ సభలో పదవి ఇవ్వలేదని.. చంద్రబాబుపై అలిగి ఓపెన్ గానే ట్విట్టర్ లో కామెంట్లు పెట్టారు. అప్పుడసలు ఆయన బిజెపిలోకి వెళ్లిపోతారనే ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం ఈ ట్వీట్.. నిజంగా ఉన్న పరిస్ధితిని చెప్పేటట్లే ఉందని.. దీని నుంచి లెసన్స్ తీసుకోవాల్సింది అధిష్టానం మాత్రమేనని.. కొందరు నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.
మరోవైపు పార్టీ నేత లోకేష్.. పార్టీలో.. తన బలాన్ని, బలగాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ఇక ఎటూ ఫ్యూచర్ నేత తానే కాబట్టి.. ఈసారి ఎన్నికలకు సరిగా సన్నద్ధమయ్యేలా.. ప్రతి జిల్లాలో నాయకత్వాన్ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. సెకండరీ నాయకత్వానికి ఎక్కువగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. పార్టీమెంటరీ నియోజకవర్గాల వారీగా ఏర్పడబోయే జిల్లాలను దృష్టిలో పెట్టుకునే కొత్త కమిటీలు ఉంటాయని చెబుతున్నారు. అలా లోకేష్ పార్టీపై గ్రిప్ పెంచుకునే పనిలో ఉన్నారు.
కాకపోతే.. ఎలాంటి కార్యాచరణ లేకుండా.. కేవలం ట్వీట్లు.. కమిటీలతో.. పార్టీ బలం ఎలా పుంజుకుంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. మొదటి నుంచి ఎన్టీరామారావు నాటి నుంచి.. పార్టీని అభిమానిస్తున్న వారు.. వారి తర్వాత జనరేషన్స్ వారు మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని బలంగా కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాస్త ముందుగానైనా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని.. లేదంటే పార్టీ పుంజుకోవడం కష్టమని వారనుకుంటున్నారు. కాని ఈ పరిణామం లోకేష్ , జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఆధిపత్యపోరుకు దారి తీసే అవకాశముంది.