అత్తకొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్విందని శోకం పెట్టిందట వెనుకటికి ఒకావిడ. విజయవాడ టీడీపీలో ఆ పార్టీ నేతల వ్యవహారం ఇప్పుడలానే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమి గురించి బాధలేదు కానీ.. విజయవాడలోని 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఢీ అంటే ఢీ అంటున్నారు. తాము సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలంటే.. తాము సూచించిన వారికే కట్టబెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇద్దరూ ఒకేపార్టీకి చెందిన నేతలన్న విషయం మరిచి పరస్పరం బహిరంగ వేదికలపై మాటా మాటా అనుకుంటున్నారు కేనిశేని, బుద్దా. దీంతో ఎవరిని సముదాయించాలో తెలియక అధిష్టానం తలపట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ పాగా వేసిన విషయాన్ని తలుచుకొని బాధపడుతున్న అధినే చంద్రబాబు.. కొత్తగా విజయవాడలో ఈ ఇరువురు నేతలు చేస్తున్న ఓవరాక్షన్‌పై తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టుగా నేతలు చెప్పుకుంటున్నారు.39వ డివిజన్ అభ్యర్థి ఎంపికను పార్టీ అధ్యక్షుడు అచ్చెనాయుడు చూసుకుంటారని.. ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని సూచించినట్టు సమాచారం.