నల్గొండ, తొలివెలుగు:కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత అభ్యర్థిని సీఎం చేయాలంటూ ఇటీవల కామెంట్స్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసం ఆశ పడే వ్యక్తిని కాదని తెలిపారు. తనకు సీఎం పదవి అవసరం లేదని చెప్పారు.
బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ దగ్గర ఆయన పుట్టిన రోజు వేడుకలను అనుచరులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయన పాల్గొనగా అనుచరులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. తాను సీఎం పదవిని కోరుకోవడం లేదని, ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయాన్ని పార్టీ చూసుకుంటుందని తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొందిన వారికే సీఎం కుర్చీ దక్కుతుందన్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో అందరికి తెలిసిన విషయమేనని వివరించారు.
రేపు తెలంగాణలోనూ అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందన్నారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని.. తామంతా ఐకమత్యంగా వున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 70 నుంచి 80 సీట్లు వస్తాయని పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.