తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలను సెట్ రైట్ చేసేందుకు కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం వచ్చీరాగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి గాంధీ భవన్ రావాలని కోరారు. కానీ, ఆయన బయట కలుద్దామని చెప్పారు. అనుకున్నట్టే వీళ్లిద్దరు బయట కలుసుకున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వీరి భేటీ జరిగింది.
గురువారం ఉదయం థాక్రేతో కోమటిరెడ్డి సమావేశమయ్యారు. ఇంఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు వెంకట్ రెడ్డి. ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారు. కోమటిరెడ్డి వెంట పలువురు నేతలు ఉన్నారు.
ఈ భేటీలో కొన్ని కీలక విషయాలపై ఇద్దరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో మొదటినుంచి జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని థాక్రేతో కోమటిరెడ్డి చెప్పినట్లు సమాచారం. అలాగే.. తమకు తెలియకుండా అనేక కీలక నిర్ణయాలు జరిగాయని ఫిర్యాదు చేశారట. దీంతో ఇకపై అలా ఉండదని.. సమిష్టి నిర్ణయాలే అమలు చేయబడుతాయని థాక్రే హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం పార్టీకి మీ అవసరం చాలా ఉందని కోమటిరెడ్డితో థాక్రే చెప్పినట్టు సమాచారం. హైకమాండ్ అన్నీ చూసుకుంటుందని, ఇకపై ఎవరికీ అన్యాయం జరుగదని మాణిక్ రావు భరోసా ఇచ్చారట. రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి. కేవలం.. తన నియోజకవర్గ పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు థాక్రేతో భేటీ తర్వాత ఆయన ఏం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.