ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాల లింకులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చారు. అయితే.. ఈ స్కాంలో మొదటి నుంచి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఇదే అదునుగా అటు కవితను, ఇటు శ్రీనివాసులు రెడ్డిని ఓ ఆటాడుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలు మీడియా ముందుకొచ్చారు. ఇదంతా దురుద్దేశంతో బీజేపీ చేస్తోందని కవిత ఆరోపించగా.. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని శ్రీనివాసులు రెడ్డి అంటున్నారు.
డిల్లీ లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని చెప్పారు. తన పేరు బయటకు వస్తే గతంలోనే వివరణ ఇచ్చానని తెలిపారు. అమిత్ ఆరోరా చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని తన పేరును రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు తనకు అతనెవరో కూడా తెలియదని స్పష్టం చేశారు.
అమిత్ ది నార్త్ అని.. అతనితో వ్యాపారాలు ఎందుకు చేస్తామని ప్రశ్నించారు మాగుంట. అలాగే.. ప్రస్తుతం తమకు ఎలాంటి లిక్కర్ వ్యాపారం లేదని స్పష్టం చేశారు. గతంలో చేసేవాళ్లమన్నారు. ఇప్పుడు వాటితో సంబంధం లేదని తేల్చిచెప్పారు.
ఈ కేసులో మాగుంట, ఆయన తనయుడు రాఘవరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈడీ రిపోర్ట్‌లో వారి పేర్లు ఉన్నాయి. మాగుంట కుటుంబ సభ్యులతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి పేరు ఉండడంతో ప్రతిపక్షాలు వైసీపీని ఎటాక్ చేస్తున్నాయి.