అదృష్టం ఏ రూపంలో ఎలా కలిసి వస్తుందో ఎవరూ చెప్పలేరు. లక్ కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా రాత్రికి రాత్రే లక్షాధి కారిగా మారిపోయాడు. నవమి రోజున దొరికిన ఓ వజ్రం.. అతని తలరాతనే మార్చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాలో నివాసముంటున్న రాణా ప్రతాప్ తన భార్య పేరుతో.. మధ్య ప్రదేశ్ లోని సిరస్వాహాలోని భర్కా గని ప్రాంతంలో ఓ మైన్ లీజుకు తీసుకున్నాడు. ఆరు నెలలుగా తవ్వకాలు జరుపుతున్నారు.
అయితే మంగళవారం నవమి రోజున అతనికి ఓ వజ్రం దొరికింది. దాన్ని వెంటనే చెక్ చేయించగా 9.64 క్యారెట్ల నాణ్యత ఉందని తేలింది. అంతటి విలువైన వజ్రం దొరికినందుకు రాణా ప్రతాప్ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్లో డిపాజిట్ చేసినట్లు తెలిపాడు రాణా ప్రతాప్.
కాగా ఈ వజ్రం విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా. దీన్ని రానున్న డైమండ్ ఆక్షన్లో ఉంచనున్నట్లు రాణా ప్రతాప్ తెలిపాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంతభాగం పేద పిల్లల సహాయం కోసం ఖర్చు చేస్తానని అన్నాడు. మరో పెద్ద గనిని లీజుకు తీసుకుని, తవ్వకాలు జరిపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు రాణా ప్రతాప్.