ఎన్నో వివాదాల నడమ రిలీజ్ అయింది ‘ది కేరళ స్టోరీ’ చిత్రం. రాజకీయ పరంగా తీవ్ర వివాదం రేపింది. అయితే ఇంత వివాదం రేపిన ఈ సినిమా.. భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో ప్రియుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ ఖజ్రానా ఓ ప్రేమ జంట నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివిన యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. యువకుడు మాత్రం 12వ తరగతి వరకే చదివాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.
అయితే ఈ జంట ఇటీవల రిలీజ్ అయిన ‘ది కేరళ స్టోరీ’ మూవీని చూసొచ్చారు. అనంతరం సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనపై అత్యాచారం చేశాడంటూ ప్రియుడిపై కేసు పెట్టింది.
పెళ్లి కోసం తనని మతం మార్చుకోవాలంటూ మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.