ప్రత్యేక హోదా విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీపై ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి టీడీపీ తీరని అన్యాయం చేసిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ప్రత్యేక హోదా లేదని చెబుతూ స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా? అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
తనను ఏక చిత్ర హీరో అంటూ రఘు రామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కావాలనుకుంటే సీఎం వైఎస్ జగన్ అనుమతి తీసుకుని పది సినిమాల్లో హీరోగా నటించగలనన్నారు. కానీ, రఘురామ కృష్ణంరాజు కామెడీ యాక్టర్ గా కూడా పనికిరాడంటూ ఎద్దేవా చేశారు.
అధిక ధరలపై నారా లోకేశ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉత్తర కుమారుడిలాగా లోకేశ్ మాట్లాడుతున్నారని చెప్పారు. దేశంలో ఉన్న అధిక ధరలే ఏపీలోనూ ఉన్నాయన్నారు. లోకేశ్ లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో కామెడీ ఉండదంటూ ఆయన అన్నారు.