తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. తెలంగాణలోనే జాతీయ రహదారులకు కేంద్రం డబ్బులు అడుగుతోందని మండిపడ్డారు. హైవేల నిర్మాణంలో 50 శాతం భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటోందని… దేశంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదన్నారు. ఆఖరికి రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెడుతోందని ఆగ్రహించారు.
నీతి ఆయోగ్ తదితర సంస్థల ఫిర్యాదులను సైతం కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు నామా. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర అవసరాల కోసం ఎప్పుడయినా ఆయన మాట్లాడారా? అని ప్రశ్నించారు. తాము తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడితే అడ్డుకున్నారని ఆరోపించారు.
ఖమ్మం, బయ్యారం ప్రాంతాల్లో ఖనిజ సంపద ఉందని, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకొస్తే దండ వేసి దండం పెడతానని అన్నారు నామా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం బుధవారం నిరసన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణపై కేంద్రం కక్ష పెట్టుకుంది కాబట్టే ఫ్యాక్టరీ రావడం లేదని ఆరోపించారు.
8 ఏళ్లుగా విభజన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు నామా. కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని.. రైతులు, నిరుద్యోగులు, సామాన్యులకు బడ్జెట్ తో ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు నామా నాగేశ్వరరావు.