అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని కోర్టును పిటిషన్ లో కోరారు.
పిటిషన్ పై నేడు మధ్యాహ్నం వాదనలు విననున్నట్టు హైకోర్టు తెలిపింది. కౌర్ దంపతులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. దీంతో వారు ఆదివారం రాత్రి జైలులోనే ఉన్నారు.
వారిద్దరికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఎంపీ నవనీత్ కౌర్ ను బైకులాలోని మహిళా కారాగారానికి పోలీసులు తరలించారు. ఆమె భర్త ఎమ్మెల్యే రవిని తలోజా జైలుకు పంపించారు.
హిందూత్వ భావజాలాన్ని మహారాష్ట్ర సీఎం మరచిపోయారని, అందుకే హిందూత్వాన్ని గుర్తు చేసేందుకు ఆయన ఇంటి ముందు శనివారం ఉదయం 9 గంటలకు హనుమాన్ చాలీసాను చదువుతానని ఎంపీ నవనీత్ కౌర్ ప్రకటించారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఎదుట హాజరు పరచగా వారికి 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది.