అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవికి షాక్ తగిలింది. ఇరు వర్గాల మధ్య మత ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారన్న కారణంపై ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తాజాగా వారికి 14రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.
వీరి బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 29న విచారణ చేపట్టనున్నట్టు బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తెలిపారు. ఇప్పటి వరకు నవనీత్ కౌర్ పై మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి. మరోవైపు శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరుగురు శివసేన సైనికులను పోలీసులు అరెస్టు చేశారు.
హిందూత్వ భావజాలాన్ని మహారాష్ట్ర సీఎం మరచిపోయారని, అందుకే హిందూత్వాన్ని గుర్తు చేసేందుకు ఆయన ఇంటి ముందు శనివారం ఉదయం 9 గంటలకు హనుమాన్ చాలీసాను చదువుతానని ఎంపీ నవనీత్ కౌర్ ప్రకటించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవనీత్ దంపతులను అడ్డుకునేందుకు సీఎం ఇంటి వద్దకు శివసేన సైనికులు పెద్దఎత్తున చేరుకున్నారు.
చెప్పిన సమయానకి సీఎం ఇంటి వద్దకు నవనీత్ కౌర్ రాకపోవడంతో ఆమె నివాసం వద్దకు శివసేన సైనికులు వెళ్లారు. హనుమాన్ చాలీసాను చదివేందుకు ఎంపీ రావాలని శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవిని పోలీసులు అరెస్టు చేశారు.