ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ యాత్రలో కొత్త అంశం ఏమీ లేదని వెల్లడించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పని అయి పోయిందని, ప్రజలు బయటకు వస్తున్నారన్నారు. డబ్బులతో రాజకీయం చేయడం మానాలని ఎంపీ రఘురామ సూచించారు.
ఎవరు నిలబడగలరు, ఎవరు అండగా ఉంటారో నమ్ముతూ.. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చారన్నారు. కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభావం చాలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు రఘురామ కృష్ణం రాజు. తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రజలు వైసీపీని తిరస్కరించారని, పులివెందులలో కూడా మెజారిటీ లేదని అన్నారు.
సీఎం జగన్ ఢిల్లీ యాత్రలో ఎలాంటి కొత్త అంశం లేదన్నారు. కానీ ఢిల్లీకి తీసుకెళ్లి ఇచ్చే వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజ్ మాత్రం పెరిగిందని సెటైర్లు వేశారు. టీడీపీ అభ్యర్థులు శ్రీకాంత్, భూమి రెడ్డి రామ గోపాల్ రెడ్డి ఖర్చు చేయలేదని.. వైసీపీ శ్రేణులు ఎక్కువగా ఖర్చు పెట్టారని తెలియవచ్చిందన్నారు రఘురామ కృష్ణం రాజు.
తెలుగు దేశం పార్టీకి మెజారిటీ వచ్చిందంటే ధన ప్రవాహం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రపు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. రాజధాని మార్పుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుని పోవడం ఖాయమంటూ స్పష్టం చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.