లేఖల ద్వారా సీఎం జగన్, ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరగటంతో… ఏపీ నుండి అయోధ్య వెళ్లే రామ భక్తుల సౌకర్యాల కోసం ఇప్పుడే చర్యలు ప్రారంభించాలని ఎంపీ సూచించారు.
టీటీడీ తరుపున తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టడంతో పాటు దాదాపు 100 గదుల నిర్మాణం ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయాలని… కనీసం మూడు ఎకరాల భూమి కేటాయించే విధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించాలని లేఖలో కోరారు.
మంత్రులు, ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేసి యూపీ సీఎంతో మాట్లాడాలని ఎంపీ సూచించారు. భక్తుల భాగస్వామ్యం కూడా ఉండేలా చూస్తే టీటీడీకి కూడా ఆర్థిక భారం కాదని, ఏపీ ప్రభుత్వానికి కూడా మంచిదని ఎంపీ లేఖలో ప్రస్తావించారు.