నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీపై విమర్శలు చేస్తున్న ఎంపీ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు, రాజధానిపై రెఫరెండంగా సీఎం రాసిస్తాడా అంటూ ఎంపీ సవాల్లు విసురుకున్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్ సమావేశాలకు హజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాపై కుండబద్ధలు కొట్టారు. నేను నా ఎంపీ పదవికి రాజీనామా చేయ్యను గాక చెయ్యను అని స్పష్టం చేశారు. నేను ఫలానా బొమ్మతో, నా ముఖంతోనే గెలిచానన్నారు. నా కోసం జనం బటన్ నొక్కారని, నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు కూడా ఆ విషయం తెలుసు అంటూ మండిపడ్డారు.
అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఆ నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వెనకడుగు వేశారని, ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు కాబట్టి మీరే మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిపై మీరు మాట తప్పారు కాబట్టి మీరు, మీ మంత్రివర్గం రాజీనామా చేయండి తప్ప నేను చేయాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నాను నేను పార్టీకి విధేయుణ్ణి.. పార్టీ ఆనాడు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నానని స్పష్టం చేశారు.