నేను కొట్టినట్లు చేస్తా… నువ్వు ఏడ్చినట్లు చెయ్ అన్నట్లుగా బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు నటిస్తున్నాయంటూ కొంతకాలంగా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. ఢిల్లీలో స్నేహాం చేస్తూ… గల్లీలో ప్రత్యర్దులుగా నటిస్తున్నాయని ఆరోపిస్తూనే, కాంగ్రెస్ ను అంతం చేయాలన్న కుట్రలకు చెక్ పెడతామన్నట్లుగా ఎంపీ రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు.
అభివృద్ధి, పాలకుల అసమర్థత అంశాలు తెరపైకి రాకుండా మందిర్ రాజకీయాలు ఫోకస్ అవుతున్న నేపథ్యంలో… ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజల్లో ఉండేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు కనపడుతంది. ఇటీవలే ఆర్మూర్ లో పసుపు రైతులకు మద్దతుగా దీక్ష చేయగా, అచ్చంపేటలో ఈ నెల 7న దీక్షకు రెడీ అవుతున్నారు. ఇక నుండి నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో అక్కడి సమస్యలు, రైతాంగానికి మద్దతుగా రేవంత్ రెడ్డి తెలంగాణవ్యాప్తంగా పర్యటించనున్నారు.
పీసీసీ ఎవరు, ఆ పదవి ఎవరికి అన్నది పక్కనపెట్టి… ముందుగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతూ, వచ్చే జమిలీ ఎన్నికల నాటికి పార్టీని సిద్దం చేయాలన్న తపనతో రేవంత్ రెడ్డి దీక్షలు చేస్తున్నారు. సీనియర్లను కలుపుకుపోతూనే, పార్టీని ముందుకు నడిపేలా కార్యచరణ రెడీ అయ్యింది. దీనికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ దీక్షల తర్వాత అవసరం అయితే పాదయాత్రకు కూడా రెడీ అని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. పైగా దేశంలో రైతు ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో… రేవంత్ రైతు దీక్షలు పార్టీకి మేలు చేస్తాయని, బీజేపీ-టీఆర్ఎస్ లను ఇరకాటంలో పెడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.