గాంధీ భవన్ లో నలుగురు సీనియర్లు కూర్చున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రే సరిగ్గా ఆ నలుగురి సమావేశం ఎజెండా. యాత్రను ఎట్ల ఆపాలి అన్నదే ఈ నలుగురి ఆలోచన. ఈ సీన్ కాసేపు పక్కన పెడదాం.

అచ్చంపేటలో రైతు దీక్ష వేదిక నుంచి అనుకోకుండా రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన పాదయాత్ర తెలంగాణలో రైతు ఎజెండాను ఆకాశానికెత్తింది. ఢిల్లీలో రైతులు మూడు నెలలుగా కనీవినీ ఎరుగని స్థాయిలో దీక్ష చేస్తూ… మోడీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. ఓ వైపు ఉత్తర భారతంలో రైతు ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే… దక్షణాన మాత్రం ఇన్నాళ్లు చడీచప్పుడు లేదు. అలాంటిది… రేవంత్ రెడ్డి పాదయాత్ర తో రైతులోకంలో కొంత కదలిక వచ్చింది. ఢిల్లీ స్థాయిలో అనలేం కానీ… ఇక్కడా రైతు పోరుకు బీజం పడింది.
ఒకవైపు రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతున్న తరుణంలో… రైతు చట్టాలు కాంగ్రెస్ కు కలిసి వచ్చే అస్త్రాలని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీని, టీఆర్ఎస్ ను ఏకకాలంలో టార్గెట్ చేయగల ఏకైక అస్త్రంగా దీనిని వారు అభివర్ణిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నారు.
అయితే, ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఆది నుంచి రేవంత్ స్పీడు నచ్చని సీనియర్లు మళ్లీ గాంధీ భవన్లో కూర్చొని పావులు కదిపారు. రేవంత్ యాత్రను డైల్యూట్ చేయాలన్న వ్యూహంలో భాగంగా పోటీ యాత్రలకు మరికొందరు లీడర్లను రంగ ప్రవేశం చేయించారు. అందులో భాగమే సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క రైతులతో ముఖాముఖీ యాత్ర, కోమటిరెడ్డి చేస్తానని చెబుతోన్న పాదయాత్ర, జగ్గారెడ్డి చేస్తానని చెబుతోన్న పాదయాత్ర… ఐతే, సీనియర్లు రచించిన ఈ పోటీ పాదయాత్రల స్ట్రాటజీ అంతగా వర్కవుట్ అయిన పరిస్థితి లేదు. ఎందుకంటే… రైతు ఎజెండా అప్పటికే హోల్ అండ్ సోల్ గా రేవంత్ ఖాతాలో చేరిపోయింది. ఆయన ఉదృతంగా చేలల్లోకి వెళ్లిపోయి… రైతులతో మమేకమైపోయారు. దీంతో పాదయాత్ర ముగింపు దశలో సరికొత్త వివాదంతో సీనియర్లు తెర మీదకు వచ్చారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదు అన్నది వారి సరికొత్త ఆరోపణ. కనుక… సీనియర్లు ఎవరూ ఆయన పాదయాత్ర ముగింపు సభ అయిన రాజీవ్ రైతు రణభేరి సభకు వెళ్లకూడదు అని తీర్మానించుకున్నారని సమాచారం.
సీనియర్లు ఆరోపిస్తున్నట్టు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదా అంటే… మల్లు రవి లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు… కాంగ్రెస్ పనైపోయింది అనుకున్న తరుణంలో ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాలను రేవంత్ రెడ్డి అందిపుచ్చుకుని, మళ్లీ పార్టీని లైమ్ లైట్ లోకి తెచ్చారన్నది ఆయనకు మద్ధతిచ్చే సీనియర్ల వాదన. రైతు చట్టాల పై ఆయా రాష్ట్రాలలో వివిధ రూపాలలో పోరాటాలు చేయాలని ఏఐసీసీ ఒక సర్క్యూలర్ జారీ చేసింది. ప్రతి నాయకుడు తనకు తోచిన రూపంలో పోరాటం చేయాలన్నది ఆ సర్క్యూలర్ సారాంశం. ఈ సర్క్యూలర్ మేరకు రాహుల్ గాంధీనే స్వయంగా రాజస్థాన్ లో ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని అందరికీ మార్గనిర్దేశం చేశారు. ఇదే రేవంత్ పాదయాత్రకు ఐఏసీసీ ఇచ్చిన ఆదేశంగా ఆయన వర్గంలోని సీనియర్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు పార్టీ ఆమోదం లేకపోతే… మాజీ రాష్ట్ర మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రేణుఖా చౌదరి, మాజీ ఎంపీలు రాజయ్య, సురేష్ షట్కర్, మల్లు రవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లాంటి హేమాహేమీలు ఈ యాత్రలో పాల్గొని ఆయనకు ఎందుకు మద్ధతిస్తారన్నది రేవంత్ వర్గం ప్రశ్న.
మొత్తంగా సీన్ చూస్తుంటే… ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టీ విక్రమార్క చెట్టాపట్టాలేసుకుని వ్యవహారం నడుపుతున్నట్టు అర్థమవుతోందని జిల్లా స్థాయి నేతలు చెబుతున్నారు. రేవంత్ పాదయాత్ర ముగింపు సభకు వెళ్లొద్దని ఆదేశాలు వస్తున్నది కూడా వీరిద్దరి నుంచేనని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రేవంత్ పాదయాత్రను ఈ ఇద్దరు నేతలు కలిసి ఎంత వివాదాస్పదం చేసినా… ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యాత్ర పార్టీకి కొంత ఊపిరి పోసింది అన్నది మాత్రం ముమ్మాటికీ వాస్తవం.