సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయా కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని, కనీసం ఎంపీ అనే గౌరవం లేకుండా తనను అవమానిస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయబోతున్నారు.
కేంద్ర సహయంతో పీపీపీ మోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్మిస్తోన్న మెట్రో రైల్ కారిడార్-2లో భాగంగా జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు 6.9కి.మీ రూట్‌ను సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మెట్రో రైలు సంస్థ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల పేరుతో ప్రముఖులకు స్వాగత పత్రికలు కూడా వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రముఖ పేపర్లలో ఘనంగా ప్రకటనలు కూడా ఇచ్చింది. ఈ ప్రకటనల్లోనూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖుల పేర్లు, ఫోటోలు వేసుకున్నారు.
కానీ, స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రోటోకాల్ అధికారులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనో, మెప్పు కోసమో… ఇలా చేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఓ వైపు పార్లమెంట్ నడుస్తున్న సమయంలో పార్లమెంట్ సభ్యుడిగా నాకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని రేవంత్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు. సీఎస్ సోమేష్‌కుమార్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గులాబీ షర్ట్స్ వేసుకొని, పార్టీ కండువాలు కప్పుకోవాలని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్ ఓపెనింగ్ సందర్భంగా మల్కాజ్‌గిరి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ అసెంబ్లీ ఏరియా పరిధిలో సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.