గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జ్ గా రేవంత్ రెడ్డిని ఖరారు చేయనున్నారా…? వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు గ్రేటర్ లో సగానికి ఎక్కువగానే ఉన్న మల్కాజ్ గిరి ఎంపీగా కూడా ఉన్న నేపథ్యంలో రేవంత్ పైనే కాంగ్రెస్ బారం వేయనుందా అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.
డిసెంబర్ లో గ్రేటర్ ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చేస్తుందన్న హాడావిడిలో ప్రభుత్వం ఓపెనింగ్స్, పథకాలంటూ హాడావిడి చేస్తుంది. అటు దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ కూడా దూకుడుగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను మొత్తం ఎంపీ రేవంత్ రెడ్డికి అప్పజెప్పటంతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతల కుటుంబీకులను పోటీ చేయించాలని అధిష్టానం నుండి ఆదేశాలు రానున్నాయి. తద్వారా నేతలంతా గెలుపే లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో ఇంచార్జ్ మాణికం ఠాగూర్ రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటనలోనే గ్రేటర్ మ్యానిఫెస్టో, ప్రచార నిర్వహణ తీరు, ఇంచార్జి నియామకం, అభ్యర్థుల ఫైనలైజేషన్ అన్ని పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వరద పరిస్థితుల నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిహారం అందని వారి కోసం కమిషనర్లతో భేటీ కావటంతో పాటు ఆందోళనలు నిర్వహించారు. పైగా ఎవరు కీలకంగా పనిచేస్తారు, ఎవరికి బలం ఉందన్న అంశాలు ఆయన ఎంపీగా చూస్తున్నందున ఆయనవైపే పార్టీ అధినాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.