దేశవ్యాప్తంగా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో… తెలంగాణలో పార్టీని ఎలాగైన బ్రతికించుకోవాలన్న కసితో ఉన్న ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న చర్చల తర్వాత రేవంత్ రెడ్డికే పీసీసీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దూకుడు పెంచుతున్న బీజేపీని, అధికార టీఆర్ఎస్ ను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి అని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణుల అభిప్రాయం అదే అయినా… కొంత మంది సీనియర్ల అసంతృప్తితో పునరాలోచనలో పడ్డప్పటికీ పార్టీకి జవసత్వాలు నింపే నాయకత్వం వైపే మొగ్గుచూపినట్లు ఏఐసీసీ వర్గాలంటున్నాయి. పూర్తి స్వేచ్ఛనిస్తూ రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు.
తుది వరకు పీసీసీ రేసులో ఉన్న మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అధిష్టానం బుజ్జిగించినట్లు తెలుస్తోంది. ఆయన్ను కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి అయిన సీడబ్ల్యూసీలోకి తీసుకోవటంతో పాటు భవిష్యత్ లో మీకు అన్ని రకాల సహాయ సహకారాలుంటాయని చెప్పినట్లు సమాచారం. పార్టీని సమిష్టిగా అధికారంలోకి తీసుకరావాలని, మీ ఆలోచనలకు… కార్యాచరణకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.
పీసీసీగా రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ గా కోమటిరెడ్డి పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.