తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. గత కొంతకాలంగా కొత్త నాయకత్వంపై ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ… ఫైనల్ గా రేవంత్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
దూకుడైన యువ నాయకత్వం ఉంటేనే తెలంగాణలో కాంగ్రెస్ బ్రతకగలుగుతుందని, లేదంటే దుబ్బాకలాగే బీజేపీ పాగా వేస్తుందని కాంగ్రెస్ అధినాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో టీఆరెఎస్ ను ఓడించాలన్నా, బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నా… ఇదే సరైన సమయం అని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. మంగళవారం సాయంత్రం పీసీసీ మార్పుపై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈలోపే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన వస్తే మాత్రం డిసెంబర్ రెండోవారం వరకు ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది.
ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం పడగా… గ్రేటర్ లో బీజేపీకి మంచి స్థానాలు వచ్చినా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాం నింపేలా కేసీఆర్ కు ధీటుగా నాయకున్ని నిలపాలన్న ఉద్దేశంతోనే ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. కొత్త నిర్ణయంపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిర్ణయంపై పునరాలోచన ఉండబోదని ఏఐసీసీ నాయకులంటున్నారు.
రేవంత్ కు పీసీసీ కన్ఫామ్ అయిన నేపథ్యంలో… పీసీసీ ఆశించిన పలువురు నాయకులు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ ప్రకటన రాగానే బీజేపీ తీర్థంపుచ్చుకునేలా ప్లాన్ చేసుకోగా, ఇప్పటికే తమతో కలిసి వచ్చే క్యాడర్ తో నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.