సీఎం కేసీఆర్ స్వయంగా ఊరికొస్తే… అవి, ఇవీ కావు… ఊరినే దత్తత తీసుకుంటానంటే… అందరూ శ్రీమంతుడు సినిమాలో అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకుంటారు. కేసీఆర్ మహేష్ బాబులా కనిపిస్తాడు. ఇంత వరుక అలా ఊహించుకోవటంలో ఆ గ్రామ ప్రజల తప్పేం లేదు. కానీ అది రీల్… ఇది రియల్… అలా ఎలా అవుతుంది అన్నట్లుగా ఉంది కేసీఆర్ తీరు.
సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ నుండి వచ్చేప్పుడు, ఫాంహౌజ్ కు పోయేప్పుడు మధ్యలో ఉన్న మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవరం గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆయా గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. సీఎం దత్తత అంటే ఖుషీ అయిపోయారు కానీ పనులేవీ జరగటం లేదు.
తాజాగా ఈ మూడు గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం అవి ఎంత వరకు వచ్చాయి అన్న వివరాలను జత చేసి… ఎంపీ రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. అద్దంలా మెరవాల్సిన సీఎం దత్తత గ్రామాల్లో పనులెందుకు పడకేశాయని ఆయన ప్రశ్నించారు.
ఎంపీ రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు రాసిన లేఖ యధావిధిగా…
To
కలెక్టర్
మేడ్చెల్ జిల్లా
విషయం-కేసీఆర్ దత్తత గ్రామాల గురించి
కలెక్టర్ గారు కేసిఆర్ దత్తత గ్రామాల దుస్థితి చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామం అంటే సర్వాంగ సుందరంగా భూతల స్వర్గంగా ఉంటుందని అందరం భావిస్తాం. ఆ గ్రామ ప్రజల సమస్యలు చిటికెలో పరిష్కారం అవుతాయని నమ్ముతం. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ దత్తత గ్రామాలు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి, కేశవరం గ్రామాలను కేసిఆర్ మూడేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. అక్కడ అభివృద్ధి మాత్రం మిగతా గ్రామాల కంటే గొప్పగా ఏమీలేదు.
సీఎం దత్తత తీసుకున్న లక్ష్మాపూర్ గ్రామం ఎంత అధ్వాన్నంగా ఉందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సీఎం గారు ఎలాగూ ఫామ్ హౌస్ లో ఉంటారు అందుకే లక్ష్మాపూర్ దుస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం.
లక్ష్మాపూర్ గ్రామాన్ని 2017 ఆగస్టు 4వ తేదీన దత్తత తీసుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గ్రామానికి వచ్చి గ్రామ సభ నిర్వహించి గ్రామ రెవెన్యూ కొత్త నక్ష రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కానీ మూడేళ్లవుతున్నా అమలు కాలేదు. గ్రామంలో 1054 ఖాతాలుండగా 301 పాస్ బుక్ లు మాత్రమే మంజూరు చేశారు. వాటిలో కూడా రైతులకు సంబంధించిన అన్ని సర్వే నెంబర్లు పొందుపర్చలేదు. వివరాలు తప్పుల తడకలుగా ఉన్నాయి.
మిగతా 753 ఖాతాలకు సంబంధించిన పాస్ బుక్ ల విషయమై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు.
స్వయంగా సీఎం దత్తత తీసుకున్న గ్రామంలోనే రైతులకు గత మూడు దఫాలుగా రైతుబంధు రాలేదు. గ్రామంలో ఐదుగురు రైతులు మరణిస్తే వారు రైతు భీమాకు అర్హత కలిగినప్పటికీ గ్రామ రికార్డులు ధరణిలో లేవని వారి కుటుంబాలకు రైతు భీమా కింద 5లక్షల రూపాయల సాయం అందలేదు.
లక్ష్మాపూర్ గ్రామాభివృద్ధికై 15 కోట్లు మంజూరు చేసినా మూడేళ్ల కాలంలో నిర్దేశించిన పనులు పూర్తి కాలేదు.
గ్రామానికి 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైనా ఇప్పటికీ భూమి కేటాయించలేదు. గంటెడు మట్టి తీయలేదు.
మూడు చింతలపల్లి గ్రామానికి 28 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ 5కోట్లతో 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు పునాది కూడా తీయలేదు.
32 లక్షలతో స్మశాన వాటిక నిర్మిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ పని మొదలే కాలేదు.
25 లక్షలతో మార్కెట్ యార్డ్ నిర్మిస్తామన్నారు. ఇంకా పూర్తి కాలేదు.
కేశవరంను 17 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నా మూడేళ్లలో ఒక్క ఇటుక పెల్ల వేయలేదు.
పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఊసే లేదు.
గతంలో దత్తత తీసుకున్న గ్రామాల్లోని అభివృద్ధి పడకేసింది తాజాగా సీఎం వాసాలమర్రి అనే మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మూడేళ్ల క్రితం దత్తత తీసుకున్న 3 గ్రామాలు అభివృద్ధి కాకముందే యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని నవంబరు 1వ తేదీన దత్తత తీసుకోవడం, ఆ ఊరికి 100 కోట్లు ఇస్తానని చెప్పడం జరిగిపోయాయి.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారంటే ఆ గ్రామం మిగతా ఊర్లకు రోల్ మోడల్ గా ఉండాలి. అద్దం లాగ చేయాలని జనాలు ఆశిస్తరు. కానీ అవేమీ ఆచరణలో జరగలేదు. మీ జిల్లాలో ఉన్న సీఎం దత్తత గ్రామాల అభివృద్ధి పై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్న.
ఇట్లు
……………….
A . REVANTH REDDY. MP
MALKAJGIRI