రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి… రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాలైనా లక్ష రూపాయల రుణమాఫీ అమలు కాలేదని, బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదన్న రైతుల ఆవేదనను సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు.
ప్రభుత్వం పెట్టుబడి కింద ఇస్తున్న రైతుబంధును కూడా పాతరుణాల వడ్డీ కింద బ్యాంకులు జమచేసుకుంటున్నాయన్న రేవంత్… యాసంగి నాట్లు మొదలైన తరుణంలో యూరియా కొరత ఉందని రైతులు చెబుతున్నట్లు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. సన్నవడ్లు పండించిన రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి ఉందని, దీనికి మీరే బాధ్యులని ఆరోపించారు. వారిని ఎలా ఆదుకుంటారో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.
ఇప్పటికీ రైతుబంధు రాని రైతులు కూడా ఉన్నారని… వారి అవస్థలను పట్టించుకోవాలని సూచించారు. ఫాంహౌస్ లో కూర్చుని దృతరాష్ట్రుడిలా అంతా బాగుంది అని భ్రమించకండని చురకలంటించిన రేవంత్, తక్షణం నేను లేవనెత్తిన రైతుల సమస్యలు పరిష్కరించండని డిమాండ్ చేశారు.