టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై ప్రజల్లో అవగహాన కల్పించటంతో పాటు ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి వేసిన భారీ వ్యూహాం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యూహాం ఫలిస్తే దక్షిణాది నుండి తొలినాయకుడిగా గుర్తింపు పొందనున్నాడు.
ఆర్మూర్ రైతు దీక్షతో పాటు, పాదయాత్రలో ఎక్కడ మాట్లాడిన రేవంత్ ఒకే మాట చెప్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమ స్ఫూర్తిగా పోరాటానికి సిద్ధం అయితే… నేను ముందుండి కొట్టాడుతా. ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి మీ పార్టీల జెండాలు పక్కన పెట్టి కొట్లాడుదాం రండి అని పిలుపునిస్తున్నారు. మీరు పాదయాత్ర అంటే పాదయాత్ర, లేదంటే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయమన్నా చేస్తా… పదండి ఢిల్లీ వెళ్లి అక్కడే ఉండి కొట్లాడుదాం అంటూ పదే పదే రైతులను ఆలోచింపజేస్తున్నారు.
నిజానికి కొత్త రైతు చట్టాలపై ఉత్తరాది రైతుల పోరాటం ముందు దక్షిణాది రైతులు పోరాటం సున్నా. కానీ ఇక్కడా రైతాంగ సమస్యలున్నాయి. ఆ సమస్యల సాధనకు రేవంత్ రెడ్డి సక్సెస్ ఫుల్ రైతులను ఢిల్లీవైపు పాదయాత్రగా మళ్లిస్తే… గల్లీ నుండి ఢిల్లీకి రైతుల కోసం పాదయాత్ర చేసినట్లు అవుతుంది. పైగా ఓ నాయకుడు ఇంత చొరవ తీసుకొని రైతుల సమస్యలను ప్రస్తావించిన దాఖలాలు లేవు. నాలుగైదు రాష్ట్రాల మీదుగా యాత్ర సాగాల్సి ఉన్న నేపథ్యంలో… కేంద్ర రాజకీయాలను తనవైపుకు తిప్పుకుని ఒకే ఒక్కడు నిలబడ్డా ఆశ్చర్యపోనవసరం లేదు.
రేవంత్ పిలుపుపై విశ్లేషకులు సైతం స్వాగతిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంపై ఒక్క మాట అనేందుకే భయపడుతున్నారు. కేసీఆర్ వంటి నేతలే యూటర్న్ తీసుకున్నారు. కానీ రేవంత్ ఢిల్లీకి పాదయాత్ర అంటూ పిలుపునిస్తుండటం ఆహ్వానించదగ్గదని, సమస్యలపై పోరాటం చేసినప్పుడే నాయకుడి లక్షణాలు భయటపడతాయంటున్నారు.