తెలంగాణ పక్షాన నిలబడి, రాజన్న రాజ్యం తెచ్చేందుకు షర్మిల రావాలనుకుంటే… దక్షిణ తెలంగాణ ఏడారిగా మార్చబోతున్న పొత్తిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై స్పష్టత ఇవ్వాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంగా వైఎస్ మీద తెలంగాణలో అభిమానం, ప్రేమ ఉందని… ఆయన బిడ్డగా తెలంగాణకు వస్తే సారే, చీర పెడతాం కానీ పదవులు అప్పజెప్పమన్నారు. రాజన్న బిడ్డ రాజ్యమేలెందుకు కాదు తెలంగాణ తెచ్చుకున్నదంటూ స్పష్టం చేశారు.
రెండుసార్లు కేసీఆర్ సీఎం అయ్యాక… మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వదిలిన బాణం షర్మిల అని మండిపడ్డారు. రాజీవ్ రైతు భరోసా పాదయాత్రలో భాగంగా మూడో రోజు ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన షర్మిల పార్టీ ఏర్పాటుపై స్పందించారు.
తెలంగాణ వద్దు… సమైక్య రాష్ట్రం ముద్దు అని గతంలో మీ కుటుంబం అన్నదని, మొదట మీరు క్షమాపణ చెప్పి పార్టీ ప్రకటన చేయాలన్నారు. జగన్ పై తమకు నమ్మకం లేదని, ఏపీ సీఎంగా ఉన్నజగన్… ఏపీ తరుపున పంచాయితీ పెడుతుంటే మీ అన్నను కాదని తెలంగాణ పక్షాన మీరు నిలబడి కొట్లాడగలరా అని ప్రశ్నించారు. మీరు జగన్ నిర్ణయాలను ఖండించి, నిలబడగలిగితేనే ఇక్కడ రాజకీయాలు చేయండన్నారు. మీరు రాజకీయపార్టీ పెట్టడం అంటే తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని… తెలంగాణ సమాజం హర్షించదన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ పౌరుడు పాలించాలా… మన నీటిని ఏపీకి తరలించుకపోతున్న జగన్ చెల్లే ఏలాలో వైఎస్ అభిమానులు ఆలోచించాలన్నారు.
తెలంగాణకు సంబంధించి ఏ అంశం వచ్చిన బయటకొచ్చే కేసీఆర్… పదిరోజుల నుండి షర్మిల పార్టీ పెడుతుందని తెలిసినా ఎందుకు ప్రగతిభవన్ లో పండుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లీంలు, రెడ్లను దూరం చేసి, మూడోసారి అధికారం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. స్వరాష్ట్ర ఉద్యమంతో పోలిమేర్లను దాటించిన వారిని ఇప్పుడు దగ్గర తీస్తున్నారని, ఈ కుట్ర నుండి తెలంగాణ సమాజం బయటపడాలన్నారు.